ప్రాణప్రతిష్ట
కం.
ప్రాణమునిచ్చితి వీవే
త్రాణను యొసగితివి నాకు త్రాడువు గద శ
ర్వాణీ వల్లభ దయతో
ప్రాణ ప్రతిష్ట కు యనుమతి ప్రమతిని కూడన్
ప్రమతి = యదార్థ జ్ఞానము
1. ఆవాహనము
ఆవాహనం సమర్పయామి
కం.
తెలిసి తెలియకను యెంతయు
తలిచితి గద తమరినె మరి తనివిని తీరన్
వెలయగ వేడెద యిచటను
తొలుతను గొను నా వినతులు తొగదొర ధారీ
తొగదొర = చంద్రుడు
2. ఆసనం
ఆసనం సమర్పయామి
కం.
కుదురున నుండదు మదియును
కదలకనుండదు తనువును కామాక్షి పతీ
పదిలమున యాసనమిదియు
వదలక నను బ్రోవరావ వందనములివే
3. పాదయోః పాద్యం సమర్పయామి
పాద్యం
కం.
పరమ పవిత్రపు పదములు
విరిసిన కమలముల బోలు వివరింపంగన్
ఎరుకను గలిగిన శివునికి
మరిమరియొసగెద జలమును మరియాదలివే
4. హస్తయో అర్ఘ్యం సమర్పయామి
అర్ఘ్యం
కం.
కరములు చూచితి మురిసితి
శిరమున నుంచను పలికెద శివశివ శంభో
వరములనిడునా కరములు
సరిగను కడిగెద నిపుడును సలిలము తోడన్
5. ఆచమనం
ముఖే ఆచమనీయం సమర్పయామి
సగరుల మోక్షము నీయగ
భగీరధ వినతిని గంగ భరియించు విభో
జగముకు దాహము తీర్చెడు
దిగంబరుని కిత్తు జలము దినదినములలో
6. స్నానం
స్నానం సమర్పయామి
బంగరు తండ్రివి చక్కగ
నింగిని నేలను యఖిలము నిండెడు స్వామీ
గంగాధర చేయుదు మరి
అంగాంగమునకును నిండు యభిషేచనమున్
7. వస్త్రం
వస్త్రం సమర్పయామి
వలువలుగ దిసలు గలిగిన
బలప్రమధుడవు శివుడవు బాగుగ కొమ్మా
విలువైన వలువలివిగో
తులలేని శమమునొసగవె తుహినకరధరా !
8. ఉపవస్త్రము
యజ్ఞోపవీతం సమర్పయామి
యజ్ఞపురుషుడవు నీవెగ
యజ్ఞ ఫలము గొనవె స్వామి యతి పతివి గదా
అజ్ఞాన తిమిరహరుడా
యజ్ఞ నివీతమిది గొనుము యక్ష స్వరూపా
నివీతము = ఉపవీతము, ఉపవస్త్రము
9. గంధం
దివ్య శ్రీ చందనం సమర్పయామి
బూదిని తనువున దాలుచు
ఆదిపురుషుడవు భవుడవు యానతి నీవే
మోదమున యలదు నిపుడును
కేదార ! పటీరమిదియె కేల్మోడిచెదన్
పటీరము = చందనము
10. పుష్పం
నానావిధ పరిమళ పుష్పాని సమర్పయామి
శితకరుని సిగను పూవుగ
శితికంఠ యమరిచితివెగ శీరాయుధుడా
పితరుడ దయను గొనుమిదే
యతనముచే సేకరించు యలరులు దేవా
అలరులు = పువ్వులు
11. ధూపం
ధూపమాఘ్రాపయామి
మనమున గల విషయములును
తనువున వాసనలు కూడ తప్పింతువుగా
పెనుమసనపు వాసిని గద
పినాకపాణీ గొనుమిదె పిరమగు ధూపమ్
పెనుమనసము = స్మశానం, రుద్రభూమి
పిరమగు = ప్రియమైన
12. దీపం
సాక్షాత్ దీపం దర్శయామి
ఇనుడును యగ్నియు సోముడు
కనులుగ గలిగిన దొరకును కవచికి యిత్తున్
జనులకు విందగు రూపము
కనగను దీపము సొగసుగ కన్నుల నిండా
కవచి = శివుడు
13. నైవేద్యం
అమృత నైవేద్యం సమర్పయామి
జగమునకు జవము జీవము
నగవున నొసగెడి జనకుడ నగసుత పతివే
అఘములు బాపెడి రేడుకు
తగిన నివేదననిడెదను తనివిని తీరన్
14. తాంబూలము
తాంబూలం సమర్పయామి
గరళము మ్రింగిన నీకును
సరళపు నైవేద్యము మరి సరియా స్వామీ
సరసపు తాంబూలము గొని
దరిచేరిచి కావు నన్ను దయతో శంభో
15. నీరాజనం
ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి
జగతికి వెలుగువు నీవెగ
శిగను సురఝరిని ధరించు శివుడవు నీవే
వగలను దీర్చగ రావే
నగవుతొ నీరాజనము గొనగ వేడెదగా
16. ప్రదక్షిణ
ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
నిను చుట్టు తిరుగనెంచితి
తనువు పులకలెత్తగాను తపమొనరించీ
కనుగొనగను యత్తావును
కనలేకను ప్రహరణలివె కరుణను గొనుమా
ప్రహరణ = ప్రదక్షిణ
అపరాధ క్షమాపణ
అపరాధ క్షమాపణ నమస్కారం సమర్పయామి
కం.
దురితములు వేనవేలుగ
పరిపరి విధముల సలిపితి పరమేశ ప్రభో
సరిచేయగదే సకలము
కరిముఖ జనకుడ మహేశ కరుణను స్వామీ
No comments:
Post a Comment