Wednesday, January 17, 2018

కందములలో సాష్టాంగ నమస్కారము

సాష్టాంగ నమస్కారం కందములు

శిరసా ఉరసా మనసా దృష్ట్వా వచసా తథా
కర్ణాభ్యాం కరాభ్యాం పదాభ్యాం ప్రణమోష్టాంగ ముచ్యతే

శిరస్సు/తల

జ్ఞానమునకు శిరము శిరము
వీనులు, నయనములు రసన వివరము జూడన్
ఘోణము యజినము కలిసి
క్షోణిన జేరిచి నిలువున కొలుపులు చేతున్

రసన = నాలుక
ఘోణము  = నాసిక
యజినము = చర్మము
కొలుపు  = నమస్కారము

ఉరస్సు/ఛాతీ

కం.
హృదయము యూపిరితిత్తులు
సదనముగ గలదిగ యురము సరభము వీడిన్
ముదమున యర్పణ సేసెద
మది నిన్నెపుడును దలచెద మరియాదలివే

సరభము = వ్యగ్రత

మనస్సు

కం.
మనసున కలుగును తలపులు
కనబడకను పరులకెపుడు కడలిని బోలిన్
వినయమునర్పణ సేసెద
కనికరమున గైకొనగదె కరుణను జూపీ

దృష్టి / నయనములు

కం.
నిను కనుగొనిన నయనములు
మనమును మరియొక దిసలకు మరలక ముందే
కనులను నిచ్చెద నీకును
కొనుమా నను నీకడకును కోరిక దీర్చన్

వచస్సు/నోరు

కం.
బుధజనులానందింపగ
యధరముల నొసగితివి మరి యలసము లేకన్
మధురముగ నుతులు చేసెద
పథమును జూపగ యడిగితి పరిపరి విధమున్

కర్ణములు /చెవులు

కం.
నిరతము నీ నుతులు వినగ
గురువుల యానతి విని మరి గురుతెరిగితినీ
దురితములను సైరించియు
పరమపదమునీయు మిపుడు పరదేవతవే

కరములు/చేతులు

కం.
షోడష పూజలు సేయగ
వేడెద మరి పరమ పురుషు వేసట లేకన్
కీడులు బాపవె దయగొని
జోడించెద కరములు మరి జోతలు సేయన్

పదములు \ కాళ్ళు
కం.
పదములనుపయోగించితి
మధురమున నిను నుతిచేయ మరి దారి యదే
పదములతో నిను చేరుదు
గద పథమును జూపరావె కరుణతొ నేడున్

No comments:

Post a Comment